బహుజనం నెత్తిన అగ్రవర్ణ పెత్తనం

  • మళ్లీ మంత్రి పదవులు కోరుకుంటున్న రెడ్డీలు
  • రాజగోపాలరెడ్డికి మంత్రి పదవి అవసరమా?
  • ఒకే కుటుంబంలో ఇద్దరికీ ఎందుకు ఇవ్వాలి?
  • సుదర్శన్ రెడ్డి స్థానే మహేష్ గౌడ్ కు ఇవ్వొచ్చు
  • సామాజిక న్యాయం కల్లబొల్లి కబురేనా?
  • 85% బహుజన జనాభా… మంత్రివర్గంలో మాత్రం అగ్రవర్ణాలదే పెత్తనం

తెలంగాణ మంత్రి వర్గంలో అగ్రవర్ణాలే ఆదిపత్యం వహిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ మళ్లీ పదవులు కావాలని హై కమాండ్ పై ఒత్తిడి చేస్తున్నారు. అగ్రవర్ణ పెత్తనాన్ని మరింత విస్తరించేందుకు కుట్రలు పనుతున్నారు. 85% బహుజన జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల పెత్తనంపై విమర్శలు వస్తున్నాయి. కుల గణన, సామాజిక న్యాయంపై కాంగ్రెస్ చెప్తున్నవన్నీ కబుర్లే అని బహుజన వర్గాలు మండిపడుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 12 మంది ఉండగా… అందులో ఐదుగురు మినహా మిగిలిన ఏడుగురు అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు. ఇద్దరు ఎస్సీ, ఇద్దరు బీసీ, ఒక ఎస్టీ మంత్రులుగా ఉన్నారు. తెలంగాణ జనాభాలో బీసీలు 56.33%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, మైనారిటీలు 12.56% ఉన్నారని 2025 కుల గణన నివేదిక స్పష్టం చేసింది. అయినప్పటికీ 12 మంది మంత్రులలో ఏడుగురు అగ్రవర్ణాలకు చెందినవారు ఉండటం రాష్ట్ర జనాభా నిష్పత్తికి పూర్తి విరుద్ధం.

కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రచ్చ రచ్చ…
మంత్రివర్గ విస్తరణ చర్చల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. 2022లో బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనే ఒత్తిడి ఉందని సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో చర్చలు సాగుతున్నాయి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం నైతికంగా సమర్థనీయమా? రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం వల్ల కాంగ్రెస్‌కు కంటే ఆయనకే ఎక్కువ ప్రయోజనం కలిగిందని విమర్శలు వస్తున్నాయి. ఒకే కుటుంబానికి రెండు మంత్రి పదవులు ఇవ్వడం విషయంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఏం సందేశం ఇస్తుంది?

సుదర్శన్ రెడ్డి కోసం ఒత్తిడి…
నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. అదే జిల్లాలో బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్ వంటి సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, వారిని పట్టించుకోకుండా మరో రెడ్డి నాయకుడికి అవకాశం ఇవ్వాలనే చర్చలు బీసీ నాయకులలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ‘మహేష్ కుమార్ గౌడ్ లాంటి బీసీ నాయకులు దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడ్డారు. వారిని కాదని మరో రెడ్డికి పదవి ఇవ్వడం సామాజిక న్యాయానికి వ్యతిరేకం’ అని బీసీ నాయకులు విమర్శిస్తున్నారు. మంత్రివర్గంలో బీసీలకు కనీసం 50% స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

కుల గణన… ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమా?
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ కుల గణన హామీ ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రకటించింది. 2024లో జరిగిన కుల గణన సర్వేలో 3.54 కోట్ల మంది జనాభా వివరాలు సేకరించారు. ఈ సర్వే ప్రకారం, బీసీలు 1.99 కోట్ల మంది (56.33%), ఎస్సీలు 61.67 లక్షలు (17.43%), ఎస్టీలు 36.98 లక్షలు (10.45%) ఉన్నారు. ఈ డేటా ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించారు. కానీ మంత్రి వర్గంలో ఈ నిష్పత్తి అమలు కాకపోవడం కాంగ్రెస్ హామీలను ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే ఉపయోగించారనే విమర్శలకు దారితీస్తోంది.

మైనారిటీలకు స్థానంలేని మంత్రివర్గం…
తెలంగాణలో ముస్లిం జనాభా 12.56% ఉన్నప్పటికీ, మంత్రివర్గంలో ఒక్క మైనారిటీ నాయకుడికి కూడా స్థానం లేదు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ముస్లిం అభ్యర్థులు గెలవకపోవడంతో, నాంపల్లి నియోజకవర్గంలో ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రివర్గంలో చేర్చే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇది జరిగినా మైనారిటీలకు సముచిత ప్రాతినిధ్యం లభిస్తుందనే హామీ లేదు. రాహుల్ గాంధీ “జిత్నీ ఆబాదీ, ఉత్నా హక్” అనే నినాదాన్ని ప్రచారం చేసినప్పటికీ, తెలంగాణలో ఈ సూత్రం అమలు కాకపోవడం కాంగ్రెస్‌పై నీడ కమ్మేస్తోంది.

అగ్రవర్ణాల పార్టీలపై ఆశపెట్టుకోవడమే తప్పు…
బహుజన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. పైగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు అగ్రవర్ణాల పెత్తనం కిందే కొనసాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి పార్టీల్లో బహుజనులకు న్యాయం దక్కుతుందని ఆశించడమే తప్పు అని అంటున్నారు. అధిక జనాభా ఉన్నందున బహుజనులను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. అలాంటి పార్టీల వెనుకపడి సామాజిక న్యాయం కోసం గొంతు చించుకోవడం మూర్ఖత్వంగా అభివర్ణిస్తున్నారు. అడుక్కోవడం మానడంతోనే బహుజన వర్గాల్లో మార్పు తెస్తుందని ఆయా వర్గాల మేధావులు స్పష్టం చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *