ఎవరికి ఛాన్స్? ఎవరికి షాక్?

  • తెలంగాణ కేబినెట్ విస్తరణకు కౌంట్‌డౌన్
  • రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్
  • కొందరి శాఖలు మార్పు జరిగే అవకాశం
  • ఎవరికైనా ఉద్వాసన ఉంటుందా?

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా విస్తరణ జరగపోవడంతో అనేకమంది నిరాశలో ఉండిపోయారు. ప్రతి పండుగకు లేదా శుభకార్యం సందర్భంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మళ్లీ ఇప్పుడు విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు చెబుతుండటంతో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజా ప్రకటనతో ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా మంత్రి పదవులు ఎవరిని వరించనున్నాయి? ప్రస్తుత మంత్రుల్లో ఎవరికి ఉద్వాసన పలుకనున్నారు? శాఖల్లో మార్పులు ఉంటాయా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశమవుతున్నాయి.

జూన్‌లో విస్తరణ?
మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న సందిగ్ధతకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెరదించారు. ‘ఈ నెలాఖరు లేదా వచ్చే నెల ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ తప్పకుండా ఉంటుంద’ని ఆయన తేల్చి చెప్పారు. వివిధ రాజకీయ సమీకరణాలు, ప్రాంతీయ ప్రాధాన్యతల కారణంగా కొంత ఆలస్యమైందని ఆయన సమర్థించుకున్నారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన మండిపడ్డారు.

తప్పుడు ప్రచారాలపై సీరియస్…
టీపీసీసీ నూతన కార్యవర్గం ఈ నెల 26, 27 తేదీల్లో కొలిక్కి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సీఎం మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీలో నాయకుల మధ్య సమన్వయం లేదని ఆయన విమర్శించారు. మహిళా కాంగ్రెస్ ఆందోళనలు సహజమైన ప్రక్రియ అని, కాంగ్రెస్‌లో మహిళలకు ఉన్న ప్రాధాన్యం మరే పార్టీలోనూ లేదని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

హైకమాండ్‌లో మల్లగుల్లాలు…
మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం స్థాయిలో లోతైన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు పరిశీలనలో ఉండగా, రాహుల్ గాంధీ నుంచి కొంత వ్యతిరేకత వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీలో చేరిన సమయంలో వివేక్‌కు ఇచ్చిన హామీని కొందరు సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారట. ఈ అంశంపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

రేసులో ఉన్న టాప్ లీడర్స్ వీరే!
కొత్త కేబినెట్‌లో చోటు దక్కించుకునేందుకు పలువురు సీనియర్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్‌కు అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం ఆశావహుల జాబితాలో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉండటంతో, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి వెంటనే ఛాన్స్ దక్కుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి లేదా రామ్మోహన్ రెడ్డిలలో ఒకరికి బెర్త్ ఖాయమని తెలుస్తోంది. ముదిరాజ్ వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తే మహబూబ్ నగర్ నుంచి శ్రీహరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

కొందరికి షిఫ్టింగ్ తప్పదా?
ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న కీలక శాఖలైన విద్య, హోం, గనులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌పై కొత్త మంత్రులు కన్నేశారు. అయితే కొత్త వారికి ఈ శాఖలు దక్కుతాయా లేక ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు జరుగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి ఉన్న నేపథ్యంలో శాఖల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి, తెలంగాణ కేబినెట్ విస్తరణ ప్రకటనతో రాజకీయ వేడి రాజుకుంది. ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది? ఎవరికి షాక్ తగులుతుంది? శాఖల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వేచి చూడాల్సిందే. ఈ పరిణామం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *