భారత్ కూ కావాలి…ఘోస్ట్ ఆర్మీ ‘మొసాద్’

ఇజ్రాయెల్… మధ్యప్రాచ్యంలో నిత్యం అగ్నిగుండంలా ఉండే ఒక చిన్న దేశం. చుట్టూ శత్రుదేశాలు… నిత్యం ఉగ్రవాద దాడుల ముప్పు. కానీ ఇజ్రాయెల్ ధైర్యంగా నిలబడుతోంది. దానికి ఒక ముఖ్య కారణం దాని శక్తివంతమైన గూఢచర్య సంస్థ మొసాద్. మొసాద్ అంటే హెబ్రీ భాషలో “నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ”. ఇది ఇజ్రాయెల్ కు కళ్లు, చెవులు మాత్రమే కాదు… దాని రహస్య ఆయుధం కూడా. మొసాద్ తన దేశ భద్రత కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుంది. శత్రువులు ఎక్కడ దాక్కున్నా వెంటాడి వేటాడి మట్టుబెట్టే సత్తా ఈ సంస్థ సొంతం. ‘మొసాద్’ ను తక్కువ అంచనా వేసిన ఉగ్రవాద సంస్థలు, దేశాలు అడ్రస్ లేకుండా పోయాయి. కొందరు ఉగ్రవాదులు, నేతలు కుక్క చావు చచ్చారు. కానీ పాకిస్తాన్ లాంటి చిన్న దేశం 150 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి కంట్లో నలుసులా తయారైందంటే ఇక మనం మౌనం వీడాల్సిందే.

‘మొసాద్’ అంటే హడల్!

మొసాద్.‌‌.. అధికారికంగా ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్’ అని పిలిచే ఈ ఏజెన్సీ, 1949లో ఏర్పాటైంది. దీని ప్రధాన లక్ష్యం ఇజ్రాయిల్ భద్రతను కాపాడటం, శత్రుదేశాలు, ఉగ్రవాద సంస్థల నుంచి వచ్చే ముప్పులను తిప్పికొట్టడం. మొసాద్ ఏజెంట్లు అత్యంత శిక్షణ పొందినవారు‌. విదేశాల్లో రహస్య గూఢచారులుగా వ్యవహరిస్తూ, అవసరమైతే శత్రువులను నిర్మూలించేందుకు వెనుకాడరు. అది చేసిన ఆపరేషన్లు వందలు ఉంటాయి. మొసాద్ చేసిన ఆపరేషన్లపై హాలీవుడ్ లో సినిమాలు తీస్తే వాటికి ఆస్కార్ అవార్డులు వచ్చాయి.

‘వ్రాత్ ఆఫ్ గాడ్’…

ఒకప్పుడు మునిచ్ ఒలింపిక్స్‌లో పాలస్తీనా ఉగ్రవాదులు 11 మంది ఇజ్రాయిల్ హాకీ ఆటగాళ్లను దారుణంగా చంపేశారు. ఆ ఘటన ఇజ్రాయిల్‌ను తీవ్రంగా కలచివేసింది. అప్పుడు మసాద్ రంగంలోకి దిగింది. ‘వ్రాత్ ఆఫ్ గాడ్’ పేరుతో ఒక రహస్య ఆపరేషన్ ప్రారంభించి… ఆ ఉగ్రవాదులను ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి వెతికి హతమార్చింది. సంవత్సరాల తరబడి సాగిన ఈ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

‘ఆపరేషన్ ఎంటెబ్బే’ పేరుతో హైజాకర్ల హతం…

1976లో ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని పాలస్తీనా ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అప్పుడు మొసాద్ ‘ఆపరేషన్ ఎంటెబ్బే’ పేరుతో ఒక అద్భుతమైన మిషన్ చేపట్టింది. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఉగాండాలోని ఎంటెబ్బే విమానాశ్రయంపై మెరుపుదాడి చేసి… వందలాది మంది బందీలను క్షేమంగా విడిపించింది. ఈ ఆపరేషన్ మొసాద్ సాహసానికి, చాకచక్యానికి నిదర్శనంగా నిలిచింది.

ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ హత్య…

ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమం ఇజ్రాయిల్‌కు ఎప్పుడూ పెను ముప్పుగా ఉంది. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి న్యూక్లియర్ సైంటిస్ట్ మొహ్సెన్ ఫఖ్రీజాదెను టెహ్రాన్ సమీపంలో హతమార్చిన ఘటనలో మొసాద్ పాత్ర ఉన్నట్లు అనేక నివేదికలు సూచిస్తున్నాయి. రిమోట్-కంట్రోల్డ్ మెషిన్ గన్‌తో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఇది మొసాద్ అధునాతన సాంకేతికత వినియోగాన్ని తెలియజేస్తుంది. ఈ ఆపరేషన్ ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది.

ఆపరేషన్ ఒపేరా…

1981లో ఇరాక్ అణుబాంబు తయారుచేసే ప్రయత్నంలో ఉందని ఇజ్రాయెల్‌కు తెలిసింది. అప్పుడు మొసాద్ ఇజ్రాయిల్ వైమానిక దళంతో కలిసి ‘ఆపరేషన్ ఒపేరా’ పేరుతో ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాక్‌లోని అణు రియాక్టర్‌ను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్ మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

అడాల్ఫ్ ఐక్‌మన్ కిడ్నాప్…

అడాల్ఫ్ ఐక్‌మన్ నాజీ హయాంలో యూదుల ఊచకోతలో కీలక పాత్ర పోషించాడు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతను అర్జెంటీనాలో తలదాచుకున్నాడు. 1960లో మొసాద్ ఏజెంట్లు అర్జెంటీనాకు వెళ్లి ఐక్‌మన్‌ను కిడ్నాప్ చేసి ఇజ్రాయెల్‌కు తీసుకువచ్చారు. అక్కడ అతనికి విచారణ జరిపి ఉరిశిక్ష వేశారు.

ఆపరేషన్ సోలమన్…

ఇథియోపియాలో యుద్ధం, అస్థిరత కారణంగా యూదుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. మొసాద్ ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించి, 36 గంటల వ్యవధిలో 14,000 మంది ఇథియోపియన్ యూదులను ఇజ్రాయిల్‌కు తీసుకొచ్చి కాపాడింది.

మనకూ ఒక ‘మొసాద్’ ఎందుకు అవసరం?

తాజాగా కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి మన కళ్లెదుటే ఉంది. అమాయక హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన ఈ దుర్ఘటన మన దేశ భద్రతా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా, ఆఫ్ఘనిస్తాన్ వంటి శత్రుదేశాలు మన దేశం గురించి ఆలోచించాలంటే కూడా మనకు ఒక శక్తివంతమైన గూఢచర్య సంస్థ అవసరం. మొసాద్ తన రహస్య కార్యకలాపాల ద్వారా ఇజ్రాయెల్‌ను అనేకసార్లు కాపాడింది. శత్రువుల కుట్రలను ముందుగానే పసిగట్టి వాటిని తిప్పికొట్టింది. ఉగ్రవాదులకు ఒక సింహస్వప్నంలా మారింది. ఇజ్రాయెల్ వంటి చిన్న దేశం ఒక శక్తివంతమైన గూఢచర్య సంస్థను కలిగి ఉండటం వల్లనే శత్రువులు దాని జోలికి రావాలంటే భయపడతారు. అందుకే పాకిస్తాన్ లాంటి పిచ్చుక లాంటి దేశాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలంటే మనకొక మొసాద్ కావాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *