దేవుడి చెంత వైద్య ఉద్యోగి దందా

యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఒక సబ్ యూనిట్ ఆఫీసర్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. సాధారణంగా మలేరియా, డెంగీ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కలిగిన ఆ ఉద్యోగి, డబ్బు వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. హెల్త్ అసిస్టెంట్ స్థాయి నుండి ప్రమోషన్ పై సబ్ యూనిట్ ఆఫీసర్ అయిన ఇతను, ప్రైవేట్ ఆస్పత్రులు, ఆర్ఎంపీ క్లినిక్‌ల నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఒక కీలకమైన వైద్యాధికారి ఆదేశాల మేరకే ఈ వసూళ్లు చేస్తున్నానని, డబ్బులు ఇవ్వని పక్షంలో ఆసుపత్రులను సీజ్ చేస్తానని బెదిరిస్తున్నాడని సమాచారం. అంతేకాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులను సైతం వదలడం లేదని తెలుస్తోంది. అయితే పర్మిషన్లు ఇచ్చే అధికారం కానీ, ఆసుపత్రులను సీజ్ చేసే అధికారం కానీ ఆయనకు ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి 35 వేలు వసూలు

జిల్లాలో క్లినిక్ రిజిస్ట్రేషన్ అథారిటీలో నోడల్ అధికారిగా ఒక డాక్టర్, సీనియర్ అసిస్టెంట్, హెల్త్ ఎడ్యుకేటర్స్ లేదా సీనియర్ సూపర్వైజర్ వంటి అధికారులు ఉండాలి. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో అంతకంటే చిన్న స్థాయి ఉద్యోగికి అటువంటి అధికారం ఇచ్చారు. దీంతో కీలక అధికారి ఆదేశాల మేరకు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ విషయంపై భువనగిరి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలను, గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి 35 వేలు వసూలు చేసినట్లు సమాచారం.

గతంలోనూ మేడ్చల్ జిల్లాలో అక్రమాలు..

గతంలో ఈ వైద్య ఉద్యోగి మేడ్చల్ జిల్లాలో పనిచేసేవాడు. అక్కడ కూడా కీలక అధికారికి డబ్బులు వసూలు చేసి ఇచ్చేవాడని చెబుతున్నారు. అప్పట్లో ఇతను కీలక అధికారి కంటే పెద్ద అధికారిలా ప్రవర్తించేవాడని సమాచారం. కాగా ఆయన అక్రమాలపై కలెక్టర్ కు జనవరి నెలలో ఆర్ఎంపీలు, ఫిబ్రవరి నెలలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. వైద్య కీలక అధికారి తన స్వార్థం కోసం ఈ ఉద్యోగిని వెనకేసుకొస్తున్నారని వినికిడి. జిల్లాలో ఏ డిప్యుటేషన్ కావాలన్నా, రద్దు చేయాలన్నా ప్రతి దానికి రేటు నిర్ణయించేది ఈ ఉద్యోగి అని ఆరోపిస్తున్నారు. యాదాద్రి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి అక్రమాలు ఎంతకాలం జరుగుతాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *