బరువు తగ్గడానికి మందులు బెస్ట్

  • మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు
  • యోగా, వ్యాయామం కంటే మందులే బెటర్
  • వైద్యరంగంలో నూతన ఆవిష్కరణలే కారణం

సహనం వందే, న్యూయార్క్:
బరువు తగ్గాలంటే శారీరక శ్రమ చేయాల్సిన అవసరం లేదని, దానికంటే మందులతో ఈజీగా తగ్గవచ్చని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణతో ఊబకాయానికి స్వస్తి పలకవచ్చని అంటున్నారు. యోగా, వ్యాయామం కంటే బరువు తగ్గించే మందులే ఎక్కువ ప్రభావం చూపిస్తాయని ఆయన విశ్లేషించారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అమెరికాలో బిల్ గేట్స్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘సాంప్రదాయ పద్ధతుల కంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన బరువు తగ్గించే మందులు ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని’ ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆరోగ్య రంగంలో సంచలనం సృష్టించడమే కాకుండా ఆధునిక వైద్యం, సాంప్రదాయ ఆరోగ్య పద్ధతుల మధ్య కొత్త వివాదానికి దారితీశాయి. “ఆధునిక బరువు తగ్గించే మందులు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఇవి జీవనశైలి మార్పులతో పోలిస్తే చాలా వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తాయ”ని బిల్ గేట్స్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవలి కాలంలో అభివృద్ధి చేసిన కొన్ని ఔషధాలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ మందులు ఊబకాయం సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటి ద్వారా ప్రజలు తమ ఆరోగ్య లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

బరువు తగ్గించే మందులపై ఆసక్తి…
ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం ఒక పెద్ద సమస్యగా మారుతున్న నేపథ్యంలో, బరువు తగ్గించే మందులపై ఆసక్తి పెరుగుతోంది. ఈ మందులు తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాలను ఇస్తాయని వైద్య నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే వీటి దీర్ఘకాల ప్రభావాలు, దుష్ప్రభావాలపై ఇంకా పూర్తి అధ్యయనం అవసరమని కొందరు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు సాంకేతికత, వైద్య రంగంలో ఆవిష్కరణలు ఆరోగ్య సంరక్షణను ఎలా మార్చగలవనే చర్చకు తెరలేపాయి. ఆధునిక ఔషధాలు, సాంప్రదాయ జీవనశైలి మార్పులు ఈ రెండింటిలో ఏది ఉత్తమమనే దానిపై ప్రజలు, నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

బిల్ గేట్స్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు…
అయితే బిల్ గేట్స్ వ్యాఖ్యలపై ఆరోగ్య నిపుణులు, యోగా సాధకులు, సాంప్రదాయ ఆరోగ్య పద్ధతులను అనుసరించేవారి నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి.‌ కొందరు ఈ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆధునిక వైద్య పరిజ్ఞానం మానవ జీవనాన్ని మెరుగుపరుస్తోందని అన్నారు. మరికొందరు మాత్రం యోగా, వ్యాయామం వంటి సహజ పద్ధతులు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తాయని, వీటిని ఔషధాలతో పోల్చడం సరికాదని వాదించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *