అంతులేని అవినీతిలో ఐఏఎస్ లు

  • రాజకీయ నేతల గుప్పిట్లో ఐఏఎస్ వ్యవస్థ
  • నాయకులతో చేతులు కలిపి అక్రమాలు
  • కీలకమైన పోస్టుల కోసం తహతహ
  • రిస్క్ చేయడానికి వెనకాడుతున్న దుస్థితి
  • దీంతో మార్పులు తీసుకురావడానికి భయం
  • ప్రజలకు న్యాయం చేయడంలో వైఫల్యం
  • ఐఏఎస్ కావడానికి వెనకాడుతున్న యువత
  • తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి…

సహనం వందే, హైదరాబాద్:
భారత పరిపాలనా వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) వ్యవస్థ దేశానికి నిజంగా న్యాయం చేయగలుగుతోందా అనే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దువ్వూరి సుబ్బారావు ఒక ప్రముఖ ఇంగ్లీష్ పేపర్లో రాసిన వ్యాసం ఈ చర్చకు ప్రధాన కారణమైంది. ‘ఐఏఎస్ వ్యవస్థ దేశానికి న్యాయం చేయలేదా?’ అనే శీర్షికతో ప్రచురితమైన ఈ వ్యాసంలో, సుబ్బారావు ఐఏఎస్ వ్యవస్థ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

క్షీణిస్తున్న విశ్వసనీయత… నైతిక విలువలు:
ఐఏఎస్ అధికారులు తమ విశ్వసనీయతను కోల్పోతున్నారని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని సుబ్బారావు ఆరోపించారు. కొందరు అధికారులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారని, ప్రజలకు న్యాయం చేయడం లేదని ఆయన విమర్శించారు. ఈ వ్యవస్థ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోతోందని, ప్రజలకు న్యాయం చేయాల్సిన అధికారులు రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఐఏఎస్ అధికారులలో నైతిక విలువలు పతనమయ్యాయని, అవినీతి పెరిగిపోయిందని సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు అధికారులు రాజకీయ నాయకులతో చేతులు కలిపి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవస్థలో నిజాయితీగా పనిచేసే అధికారులు కరువయ్యారని, అవినీతి అధికారులదే పైచేయిగా మారిందని ఆయన పేర్కొన్నారు.

రిస్క్ అంటే భయం భయం…
ఏదైనా అంశంపై రిస్క్ తీసుకునేందుకు భయమే ఐఏఎస్ వ్యవస్థను బలహీనపరుస్తున్నాయని సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ప్రజలకు న్యాయం చేయాలనే తపన కంటే తమ స్థానాన్ని కాపాడుకోవాలనే ధోరణి అధికారులలో పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా అధికారులు కొత్త ఆలోచనలు చేయడానికి భయపడుతున్నారని, వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి వెనకాడుతున్నారని ఆయన తెలిపారు. ఐఏఎస్ వ్యవస్థ యువ ప్రతిభను ఆకర్షించడంలో విఫలమవుతోందని, దేశంలోని ఉత్తమ ప్రతిభావంతులు ఈ వ్యవస్థలోకి రావడం లేదని సుబ్బారావు విశ్లేషించారు. దీనివల్ల వ్యవస్థలో సమర్థుల కొరత ఏర్పడి, పనితీరు మందగిస్తోందని ఆయన తెలిపారు. ఈ వ్యవస్థలో యువతకు ఆసక్తి తగ్గిందని, కొత్త తరం అధికారులు ఈ వ్యవస్థలోకి రావడానికి ఆసక్తి చూపడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దువ్వూరు వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు…
దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యలు ఐఏఎస్ వ్యవస్థపై తీవ్ర విమర్శలను లేవనెత్తాయి. ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విశ్లేషకులు సుబ్బారావు వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ, ఐఏఎస్ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని వాదిస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి, వ్యవస్థను ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, కొందరు మాజీ ఐఏఎస్ అధికారులు సుబ్బారావు వ్యాఖ్యలను ఖండిస్తూ, వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. వ్యవస్థలో లోపాలు ఉన్నప్పటికీ, సమర్థులైన అధికారులు కూడా ఉన్నారని వారు వాదిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి…
దేశవ్యాప్తంగా ఐఏఎస్ వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి తెలుగు రాష్ట్రాల్లోనూ నెలకొంది. అనేకమంది ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రులు, మంత్రుల వద్ద సాగిల పడిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన శ్రీలక్ష్మి… మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అలాగే మరికొందరు కేసులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా ఐఏఎస్ అధికారులు ప్రజాప్రతినిధుల వద్ద చేతులు కట్టుకుని నిల్చుంటున్నారు. మంచి పోస్టింగ్ ల కోసం చేయరాని పనులు చేస్తున్నారు. ప్రజల వద్ద ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే ఆఫీసర్లు, రాజకీయ నాయకులు ఏమి చెప్తే అది చేస్తున్నారు. అలాంటి వారికే మంచి పోస్టింగులు వస్తున్నాయి. తెలంగాణలో గత ప్రభుత్వంలో కీలకమైన పోస్టులు చేసిన వాళ్లు కూడా, ప్రస్తుత ప్రభుత్వంలోనూ కీలక స్థానాల్లో ఉన్నారు. ఐఏఎస్ అధికారులు జనం కోసమా? నాయకుల స్వార్థం కోసమా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రజలకు ఒక రూపాయి ప్రయోజనం కలిగించే పనులు చేయని వారు, నాయకులకు మాత్రం కోట్ల రూపాయల లబ్ది కలిగిస్తున్నారు. కొందరు ఐఏఎస్ అధికారులు వందల కోట్లకు పడగలెత్తారు. గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో కీలక బాధ్యతలో పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ హైదరాబాద్ చుట్టుపక్కల వందల ఎకరాల్లో భూములు కొన్నాడు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *