ఎలాన్ మస్క్ జీవితం నుంచి ఓ స్ఫూర్తి
సహనం వందే, స్పెషల్ బ్యూరో:
ఎలాన్ మస్క్.. ఈ పేరు వినగానే టెస్లా కార్లు, స్పేస్ఎక్స్ రాకెట్లు, బిలియన్ డాలర్ల సంపద గుర్తొస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా, టెక్ దిగ్గజంగా ఎదిగిన ఈ వ్యక్తి వెనుక ఓ సామాన్యుడి పోరాటం దాగి ఉంది. ఒకప్పుడు ఉద్యోగం కోసం తలుపులు తడుతూ, అనేక కంపెనీల తిరస్కరణలతో నీరసించిన యువకుడు.. ఈ రోజు అంతరిక్షంలో చరిత్ర సృష్టిస్తున్నాడు. ఎలాన్ మస్క్ తన జీవితంలోని ఆ కష్టాలను ఓ కార్యక్రమంలో పంచుకున్నారు. అతని కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది.
తిరస్కరణల సుడిగుండం…
1990ల మధ్యలో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఎలాన్ మస్క్‌కు సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన లేదు. “నాకు ఎవరితోనూ మాట్లాడే ధైర్యం ఉండేది కాదు. సిగ్గుపడే స్వభావం నాది” అని ఆయన 2012లో బిజినెస్‌మ్యాన్ కెవిన్ రోజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అప్పట్లో అతని లక్ష్యం ఒక్కటే. నెట్‌స్కేప్ అనే టెక్ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం. రెజ్యూమె మెయిల్ చేశాడు. కానీ సమాధానం రాలేదు. “నేను వాళ్ల ఆఫీస్‌కి వెళ్లి, ఎవరితోనూ మాట్లాడేందుకు సిగ్గుపడి, చివరికి ఖాళీ చేతులతో వెనక్కి వచ్చేసాను” అని మస్క్ గుర్తు చేసుకున్నారు. నెట్‌స్కేప్ ఒక్కటే కాదు.. ఎన్నో కంపెనీలు అతన్ని తిరస్కరించాయి. ఆ క్షణాల్లో మస్క్ నిరాశకు గురయ్యాడు. కానీ ఆ తిరస్కరణలే అతని జీవితాన్ని మలుపు తిప్పాయి.
జిప్2 ప్రారంభం…
1995లో, ఇంటర్నెట్ ఇంకా ప్రారంభం స్థాయిలో ఉన్న రోజుల్లో మస్క్ తన మొదటి సాఫ్ట్‌వేర్‌ను రాశాడు. ఆన్లైన్ మ్యాప్స్ కోసం ఒక ప్లాట్‌ఫాం తయారుచేశాడు. అదే 1999లో జిప్2గా రూపుదిద్దుకుంది. “నేను ఇంటర్నెట్ గురించి కలలు కన్నాను. అది ప్రపంచాన్ని మారుస్తుందని నమ్మాను” అని మస్క్ చెప్పాడు. ఆ కంపెనీ తర్వాత కోట్ల డాలర్లకు అమ్ముడైంది. అక్కడి నుంచి ఎక్స్ (పేపాల్), టెస్లా, స్పేస్ఎక్స్… ఇలా అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సలహాలిచ్చే స్థాయికి చేరాడు. ప్రపంచ టాప్ వన్ కుబేరుడయ్యాడు.
తిరస్కరణ నుంచి విజయం వరకు…
ఎలాన్ మస్క్ జీవితం సులభంగా సాగలేదు. “నెట్‌స్కేప్ నన్ను తీసుకోలేదు.. అదే నా జీవితంలో ఉత్తమ నిర్ణయం అయింది” అని ఆయన నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడు నెట్‌స్కేప్ సహ వ్యవస్థాపకుడు మార్క్ ఆండ్రీసెన్ అతని స్నేహితుడు. కానీ అప్పట్లో, ఆ తిరస్కరణ మస్క్‌కు అవమానాన్ని మిగిల్చింది. ఆ అవమానమే అతన్ని ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలబెట్టింది. ఎలాంటి తిరస్కరణ మిమ్మల్ని ఆపదు. అది మీ గమ్యాన్ని మార్చగలదని ఆయన చెబుతారు.