– తెలంగాణ సంస్కృతి సుగంధం!
సహనం వందే, హైదరాబాద్
ముత్యాల సౌరభంతో కళకళలాడే హైదరాబాద్ నగరం మిస్ వరల్డ్ 2025 వేడుకలకు సర్వసన్నద్ధమైంది. మే 7 నుంచి ప్రపంచ నలుమూలల నుండి అందాల తారలు ఈ నగరానికి చేరుకోనున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ అంతర్జాతీయ అందాల పర్వంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధునిక వైభవం విశ్వవేదికపై వెలుగులీననున్నాయి. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యే ఈ వేడుకలు, కేవలం అందాన్ని, ప్రతిభను మాత్రమే కాకుండా తెలంగాణను పర్యాటక కలనగరంగా ప్రపంచానికి చాటనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రం యొక్క చారిత్రక వైభవం, సాంస్కృతిక సంపద పోటీదారుల హృదయాలను ఆకర్షించనుంది. తెలంగాణ సంస్కృతి సౌరభంలో పోటీదారుల పర్యటన ఉంటుంది. మిస్ వరల్డ్ అభ్యర్థులు తెలంగాణ గొప్ప చరిత్రను, సంస్కృతిని, కళలను ఆస్వాదించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపడతారు.
– మే 12: ఆసియా దేశాల పోటీదారులు బుద్ధవనం, నాగార్జున సాగర్‌లలో బౌద్ధ వారసత్వ సౌందర్యాన్ని తిలకిస్తారు.
– మే 13: చార్మినార్, లాడ్ బజార్లలో సందడి చేసి, చౌమహల్లా ప్యాలెస్‌లో హైదరాబాదీ విందుతో సంస్కృతి సుగంధాన్ని ఆఘ్రాణిస్తారు.
– మే 14: అమెరికా, కరేబియన్ దేశాల అందాల తారలు వరంగల్‌లోని కాళోజీ కళాక్షేత్రంలో సాంస్కృతిక సంగమాన్ని ఆనందించి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ వైభవాన్ని దర్శిస్తారు.
– మే 15: యూరోపియన్ పోటీదారులు యాదగిరిగుట్ట దేవస్థాన దర్శనంతో పాటు, పోచంపల్లి చేనేత కళా సౌందర్యాన్ని చూసి ముగ్ధులవుతారు.
పోటీలు, ప్రత్యేక సందర్శనలతో సందడి
– మే 16: ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల అభ్యర్థులు ప్రాంతీయ పోటీల్లో పాల్గొని, యశోద, అపోలో ఆసుపత్రులలో తెలంగాణ వైద్య వైభవాన్ని తెలుసుకుంటారు.
– మే 17: గచ్చిబౌలిలో క్రీడా పోటీలు జరిగిన అనంతరం, ఎక్స్పరిమెంట్ ఎకో టూరిజం పార్క్‌లో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు.
– మే 19: తెలంగాణ పోలీస్ కమాండ్ సెంటర్, ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్లను సందర్శించి ఆధునిక అభివృద్ధిని చూస్తారు.
కళలు, ఫ్యాషన్, ప్రతిభల పర్వం…
– మే 20-21: టి-హబ్ వద్ద స్టార్టప్ వ్యవస్థాపకులతో సంభాషణలు, శిల్పారామంలో కళా వర్క్‌షాప్‌లతో తెలంగాణ సృజనశీలతను తెలుసుకుంటారు.
– మే 22: శిల్ప కళా వేదికలో ప్రతిభా పోటీలు, ఐఎస్బీలో మేధో పోటీలు జరుగుతాయి.
– మే 24-25: హిట్ ఎక్స్‌లో టాప్ మోడల్, జ్యువెలరీ ఫ్యాషన్ షోలతో ముత్యాల నగరం మెరుస్తుంది.
ఘనంగా ముగింపు వేడుకలు
– మే 26: బ్రిటిష్ రెసిడెన్సీ, తాజ్ ఫలక్ నుమాలో సాంస్కృతిక ప్రదర్శనలతో విందును ఆస్వాదిస్తారు.
– మే 31: హిట్ ఎక్స్‌లో గ్రాండ్ ఫినాలేతో విశ్వసుందరి ఎంపిక జరుగుతుంది.
– జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో విజేతలు రాజ్ భవన్లో ముఖ్యమంత్రి, గవర్నర్లను కలుస్తారు. ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతి, పర్యాటకం, ఫ్యాషన్, వ్యాపార వైభవాన్ని విశ్వవేదికపై ఆవిష్కరించే అపూర్వ సందర్భం. రాష్ట్ర ఆర్థిక, పర్యాటక రంగాలకు ఇది ఊతమిస్తుందని ఆశిస్తున్నారు.