సౌత్ పై నార్త్ ఇండియా కంపెనీ పాగా

దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం… ఇక్కడి సొమ్ము తరలించకపోతున్న వైనం
– సౌత్ ఇండియాలో ఐదు కోట్ల మందికి పైగా నార్త్ ఇండియన్స్
– నేడు జరగబోయే చెన్నై సమావేశంతో స్టాలిన్ కొత్త అధ్యాయం
– డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఐక్య పోరాటం

సహనం వందే, హైదరాబాద్/చెన్నై:
దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది ఆధిపత్యం రోజురోజుకు పెచ్చిమీరుతోంది. నార్త్ ఇండియా కంపెనీ వివిధ రూపాల్లో సౌత్ లో పునాది వేసుకుంది. తద్వారా లక్షల కోట్ల రూపాయలు నార్త్ కు తరలిపోతున్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అసమానతలు తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం చెన్నైలో నిర్వహించనున్న సమావేశం కీలకంగా మారనుంది. ఈ సమావేశంలో డీలిమిటేషన్‌పై సమిష్టి వ్యూహం రూపొందించడంతోపాటు, నార్త్ ఇండియన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సౌత్ రాష్ట్రాల ఐక్యతను బలోపేతం చేసే ప్రయత్నాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు హాజరవుతున్నారు.
నార్త్ నుంచి ఐదు కోట్ల మంది వలస…
సౌత్ ఇండియా రాష్ట్రాల్లో నార్త్ ఇండియన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక అంచనా ప్రకారం ఈ రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చినవారు సుమారు 5 కోట్ల మంది ఉండొచ్చు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేశారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో నార్త్ ఇండియన్ల ప్రభావం అసాధారణంగా ఉంది. చిన్న దుకాణాల నుంచి పెద్ద రిటైల్ వ్యాపారాల వరకు, వీధి వ్యాపారుల నుంచి రియల్ ఎస్టేట్ వరకు వారి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. చెన్నైలో టెక్స్‌టైల్, ఆహార వ్యాపారాల్లో గుజరాతీ, రాజస్థానీ వ్యాపారులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. బెంగళూరులో ఐటీ రంగంలో ఉత్తరాది వ్యాపారవేత్తలు, ఉద్యోగులు స్థానికులతో పోటీపడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ ఆధిపత్యం స్థానిక వ్యాపారులకు సవాలుగా మారింది. హైదరాబాదులో వైశ్యుల వ్యాపారాలన్నింటినీ నార్త్ ఇండియన్ వ్యాపారులు కబ్జా చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ…
గ్రామీణ ప్రాంతాల్లోనూ నార్త్ ఇండియన్ల సంఖ్య గణనీయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వరి, పత్తి పొలాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. తక్కువ వేతనంతో పనిచేయడానికి సిద్ధపడటం వల్ల వీరు స్థానిక కూలీలకు పోటీగా మారుతున్నారు. ఇది కొన్ని ప్రాంతాల్లో స్థానికుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది.
రాజకీయ వెనుకబాటుతనం…
రాజకీయంగా సౌత్ ఇండియా వెనుకబడి ఉందనే అభిప్రాయం బలంగా ఉంది. లోక్‌సభలో నార్త్ రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు (ఉత్తరప్రదేశ్-80, బీహార్-40) ఉండగా, సౌత్ రాష్ట్రాల సీట్లు తక్కువ (తమిళనాడు-39, ఆంధ్రప్రదేశ్-25). ఈ అసమానత కేంద్రంలో నిర్ణయాధికారంలో నార్త్ రాష్ట్రాల పైచేయిని చూపిస్తోంది. 2026 డీలిమిటేషన్ ఈ గ్యాప్‌ను మరింత పెంచే అవకాశం ఉందని సౌత్ రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పన్నులు ఇచ్చినా తిరిగి వచ్చేది చాలా తక్కువ…
సౌత్ రాష్ట్రాలు కేంద్రానికి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, తిరిగి వచ్చే నిధులు చాలా తక్కువగా ఉన్నాయి. గత ఐదేళ్లలో దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి రూ. 22 లక్షల కోట్లు ఇస్తే, తిరిగి వెనక్కు వచ్చింది కేవలం ఆరు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఇదిలా ఉండగా ఒక అంచనా ప్రకారం గత ఏడాది…
తమిళనాడు: రూ. 1.2 లక్షల కోట్లు ఇస్తే, రూ. 40,000 కోట్లు వస్తున్నాయి.
– కర్ణాటక: రూ. 1 లక్ష కోట్లు ఇస్తే, రూ. 30,000 కోట్లు వస్తున్నాయి.
– ఆంధ్రప్రదేశ్: రూ. 1.5 లక్షల కోట్లు ఇస్తే, రూ. 40,000 కోట్లు వస్తున్నాయి.
– తెలంగాణ: రూ. 1.7 లక్షల కోట్లు ఇస్తే, రూ. 45,000 కోట్లు వస్తున్నాయి.
– కేరళ: రూ. 50,000 కోట్లు ఇస్తే, రూ. 15,000 కోట్లు వస్తున్నాయి.
ఈ అసమానత ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. “మేం ఎక్కువ ఇస్తున్నాం, కానీ తిరిగి తక్కువ వస్తోంది” అనే భావన బలపడుతోంది.
చెన్నై సమావేశ లక్ష్యం…
డీలిమిటేషన్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పోరాటం చేస్తున్నారు. నేడు చెన్నైలోని ఐటీసీ చోళ హోటల్‌లో జరిగే సమావేశంలో స్టాలిన్ డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఐక్య వ్యూహాన్ని రూపొందించనున్నారు. సమావేశంలో కీలకంగా జనాభా ఆధారంగా సీట్లు తగ్గకుండా చూడటం, ఆర్థిక సహకారం, అభివృద్ధి సూచీలను సీట్ల కేటాయింపునకు ప్రాతిపదికగా చేయాలని ప్రతిపాదన చేయనున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు వంటివి లక్ష్యాలుగా ఉన్నాయి. స్టాలిన్ ఈ సమావేశాన్ని “సమాఖ్య స్ఫూర్తికి చారిత్రాత్మక దినం”గా అభివర్ణించారు. డీలిమిటేషన్‌తో పాటు, హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా స్టాలిన్ తీవ్రంగా పోరాడుతున్నారు. “హిందీ వల్ల తమిళ భాష, సంస్కృతి నాశనమవుతాయి. ఉత్తరాదిలో 25 భాషలు కనుమరుగయ్యాయి, తమిళనాడును కాపాడుకుంటాం” అని ఆయన హెచ్చరించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *