రేవంత్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

సహనం వందే, హైదరాబాద్:
ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం శాసనమండలిలో ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లోనే రూ. 1,58,000 కోట్ల అప్పు చేసిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో రూ. 4,17,000 కోట్ల అప్పు చేసిందని కవిత ఆరోపించారు. ప్రజల్లో కేసీఆర్ ను తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. బడ్జెట్ పై ప్రభుత్వం చేసిన అప్పులను ఎండగడతామని కవిత తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడాన్ని మధుసూదనాచారి ఖండించారు. ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సభను తూతూ మంత్రంగా నడిపిస్తున్నారని, పని గంటలు తగ్గించారని మధుసూదనాచారి విమర్శించారు. సభలో చర్చించే అవకాశం లేకున్నా ప్రజా క్షేత్రంలో పోరాడుతామని ఆయన తెలిపారు.
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డు చైర్మన్ షాజీ కేవీ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని, సూక్ష్మ సేద్యానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని, సహకార సంఘాలను బలోపేతం చేయాలని, మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకం రూపొందించాలని, ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ సామర్థ్యం పెంచేందుకు సహకరించాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు పథకాల నిధులను మార్చి 31లోగా వినియోగించాలని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో నాబార్డు పరిధిలోని పథకాలను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని, స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్ల నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలని, కొత్త గ్రామ పంచాయతీలకు గ్రామీణ అనుసంధానం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి నాబార్డు చైర్మన్‌ను కోరారు. కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలు ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. ఈ సమావేశంలో నాబార్డు ప్రతినిధులతో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *