అంతరిక్షంలో రెండు గంటల రన్నింగ్

  • చికెన్, చేపల ఆహారం… సునీత విలియమ్స్ దినచర్య
  • తొమ్మిది నెలపాటు ఆరోగ్యాన్ని కాపాడుకున్న సునీత విలియమ్స్
  • నేడు సురక్షితంగా దిగనున్న అంతర్జాతీయ వ్యోమగామి

సహనం వందే, హైదరాబాద్:
నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బారీ విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు బయలుదేరారు. అసలు 8 రోజుల మిషన్‌గా ప్లాన్ చేసిన ఈ ప్రయాణం, సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలల వరకు సాగింది. ఇంతకీలకు వాళ్లు బుధవారం స్పేస్‌ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారు భూమికి తిరిగి రానున్నారు. ఈ దీర్ఘకాల బసలో సునీత ఎలాంటి ఆహారం తీసుకున్నారు? ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకున్నారు? అనే ప్రశ్నలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ట్యూనా చేపలు, చికెన్ ప్రధాన ఆహారం…
అంతరిక్షంలో వ్యోమగాములు తినే ఆహారం భూమిపై మాదిరిగా వండుకుని తినే వంటకాలు కావు. సునీత విలియమ్స్ తన 9 నెలల కాలంలో అక్కడ ప్రాసెస్డ్ ఫుడ్‌ను ఎక్కువగా తిన్నారు. ఇందులో సీరియల్స్, పిజ్జా, ట్యూనా చేపలు, చికెన్ వంటివి ఉన్నాయి. ఈ ఆహారాలు పోషక విలువలు కోల్పోకుండా డీహైడ్రేటెడ్ లేదా ప్యాక్ చేసిన రూపంలో నిల్వ చేశారు. తాజా పండ్లు, కూరగాయలు పరిమితంగా ఉంటాయి, ఎందుకంటే అవి రీ-సప్లై షిప్‌మెంట్స్ ద్వారా మూడు నెలలకోసారి మాత్రమే అందుతాయి. నాసా ప్రకారం, సునీత రోజుకు 3.8 పౌండ్ల ఆహారాన్ని తీసుకున్నారు, ఇది ఆమె శరీర బరువు, శక్తి అవసరాలకు అనుగుణంగా రూపొందించారు.
గాలిలో ఆహారం తేలకుండా…
అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేనందున, ఆహారం గాలిలో తేలుతుంది కాబట్టి దాన్ని ప్యాకెట్లలో నీటితో కలిపి తింటారు. ఆరోగ్య సంరక్షణకు సునీత ఆరోగ్యం గురించి ఇటీవల బరువు తగ్గినట్లు కనిపిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే, ఆమె స్వయంగా “నేను వచ్చినప్పుడు ఎంత బరువుండేదానో, ఇప్పుడూ అంతే ఉన్నాను” అని స్పష్టం చేశారు. మైక్రోగ్రావిటీ వల్ల శరీరంలో ద్రవాలు మారడం, కండరాల్లో చిన్న మార్పులు రావడం సహజమని నాసా తెలిపింది. ఆమె ఆరోగ్యాన్ని ఫ్లైట్ సర్జన్లు నిత్యం టెలిమెడిసిన్ ద్వారా పర్యవేక్షించారు. అత్యవసర వైద్య సహాయం అవసరమైతే, మెడికల్ కిట్లు, శిక్షణ పొందిన వ్యోమగాములు అందుబాటులో ఉంటారు.
రెండు గంటలపాటు రన్నింగ్…
అంతరిక్షంలో కండరాలు, ఎముకల సాంద్రతను కాపాడుకోవడానికి వ్యాయామం తప్పనిసరి. సునీత రోజూ రెండు గంటలపాటు ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్, ఎక్సర్‌సైజ్ బైక్, వెయిట్‌లిఫ్టింగ్ వంటివి చేశారు. ఈ పరికరాలు మైక్రోగ్రావిటీలో శరీరాన్ని స్థిరంగా ఉంచేందుకు బంధనాలతో రూపొందించారు. ఈ వ్యాయామాల వల్ల ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని నాసా నిర్ధారించింది. మొత్తంగా, సునీత విలియమ్స్ ఈ 9 నెలల్లో సవాళ్లను అధిగమించి, ఆరోగ్యంగా భూమికి తిరిగి వస్తున్నారు. ఆమె అనుభవం అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని రాస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *