- ఒకే ఒక్క రోజులో ముంబై, ఢిల్లీ, భోగాపురం
- మూడు ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ
- విమానాలలోనే 9 గంటల సుదీర్ఘ ప్రయాణం
- చివరకు విజయవాడ పార్టీ ఆఫీసులో నిద్ర
- సేవా అభివృద్ధి పార్టీ కార్యక్రమాల సమన్వయం
సహనం వందే, విజయనగరం:
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు 24 గంటల్లో రికార్డ్ సృష్టించారు. మూడు రాష్ట్రాల్లో 5,742 కిలోమీటర్ల విమాన ప్రయాణం చేసి పలు అభివృద్ధి, సేవా, పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో ముంబై వెళ్లిన ఆయన అక్కడ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఇండియన్ అథ్లెటిక్ జ్యోతి యర్రాజికి ఘన సత్కారం చేశారు. ఆ తర్వాత అదేరోజు అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయమే లేచి 9 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చారు. ఇక్కడ నూతన విమానాశ్రయ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు భోగాపురం నుంచి మళ్లీ ఢిల్లీ వెళ్లారు. అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనంతరం రాత్రి ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. విజయవాడ పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో భోజనం చేసి అక్కడే నిద్రించారు. పార్టీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చారు.
సేవా అభివృద్ధి పార్టీ కార్యక్రమాల సమన్వయం
ముంబైలో సేవా కార్యక్రమం… భోగాపురంలో అభివృద్ధి కార్యక్రమం… విజయవాడలో పార్టీ కార్యక్రమం… ఇలా 24 గంటల్లో వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి సమన్వయం చేసుకున్నారు అప్పలనాయుడు. అహోరాత్రులు శ్రమిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న అప్పలనాయుడు బిజీ షెడ్యూల్ పట్ల వివిధ పార్టీలకు చెందిన నాయకులు, పార్టీ కార్యకర్తలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఏమాత్రం అలసట లేకుండా ఎంపీ అప్పలనాయుడు ఉత్సాహంగా పాల్గొనడంపై విస్మయ వ్యక్తం చేస్తున్నారు.
24 గంటల అప్పలనాయుడి ప్రయాణాలు:
- శనివారం: రాత్రి ముంబై నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణం 1148 కిలోమీటర్లు
- ఆదివారం: ఉదయం ఢిల్లీ నుంచి భోగాపురం ప్రత్యేక విమానంలో 1600 కిలోమీటర్ల ప్రయాణం.
- మళ్లీ ఆదివారం: సాయంత్రం భోగాపురం నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో 1600 కిలోమీటర్ల ప్రయాణం.
- ఆదివారం: రాత్రి ఢిల్లీ నుంచి విజయవాడకు విమానంలో 1394 కిలోమీటర్ల ప్రయాణం.
- 24 గంటల్లో ఆయన 5,742 కిలోమీటర్ల విమాన ప్రయాణం చేశారు.