- ఆస్పత్రుల్లో కిటకిటలాడుతున్న పేషెంట్లు
- సమయం కేటాయించలేని పరిస్థితుల్లో డాక్టర్లు
- దీంతో ఏఐ చాట్ బాట్లపై రోగుల ఆసక్తి
- వారితో గంటల తరబడి చాట్ చేస్తున్న ఏఐ
- ఏఐతో సాధారణ చికిత్సలు సంతృప్తికరం
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వైద్యానికి ఆదరణ
- అయితే ఏఐ డాక్టర్ తో సమస్యలు తప్పవు
- ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ పత్రికలో ఆసక్తికర వ్యాసం
సహనం వందే, న్యూయార్క్:
ఆసుపత్రికి వెళితే డాక్టర్ ఉంటారో లేదో తెలియదు… ఎప్పుడు వస్తారో తెలియదు… ఒకవేళ ఉన్నా బిజీ బిజీగా ఉంటారు. కొన్నిసార్లు ఎమర్జెన్సీ అంటూ వెళతారు. దీంతో రోగులు గంటల తరబడి డాక్టర్ కోసం వేచి ఉండాల్సి వస్తుంది. ఫలితంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు. ఇక కొన్ని ఆసుపత్రుల్లోనైతే డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల రోగులందరినీ సకాలంలో చూసే పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు కాలం మారింది. ఏఐ యుగం నడుస్తుంది. ఏఐ చాట్ బాట్ లతో ఎంతసేపైనా మాట్లాడే అవకాశం ఉంది. దీంతో అనేకమంది రోగులు వాటిని ఆశ్రయిస్తున్నారు.
ఐదు నిమిషాలు కూడా టైం ఇవ్వని డాక్టర్లు…
మానవ వైద్యుల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్లు రోగులతో ఎక్కువ సమయం గడుపుతున్నాయనేది అమెరికన్ రచయిత డానియల్ ఆక్స్ట్ చెబుతున్న మాట. ఐదు నిమిషాలు మాట్లాడితే చాలు అన్నట్టుగా మానవ డాక్టర్లు వ్యవహరిస్తే… రోగి జబ్బును చదివి పూర్తి వివరాలు చెప్పే ఓర్పు చాట్‌బాట్‌లకే ఉందంటాడు ఆక్స్ట్. రోగి వివరాలను పూర్తిగా అడగకుండానే మందులు రాసే మానవ డాక్టర్ల ధోరణిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలో డానియల్ ఆక్స్ట్ రాసిన వ్యాసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రోగి జీవనశైలి, ఆహారం, మానసిక స్థితి వంటి అన్ని కోణాలను పరిశీలించి చాట్‌బాట్లు సమగ్ర సలహా ఇస్తాయని ఆయన స్పష్టం చేశాడు. అమెరికాలో గ్రోక్, చాట్‌జీపీటీ వంటి చాట్‌బాట్లు రోగులతో గంటల తరబడి మాట్లాడుతున్నాయి.
మానసిక సమస్యల పరిష్కారంలో అద్భుతం…
ఒక మహిళ మానసిక ఆందోళన రుగ్మతతో బాధపడుతూ చాట్‌బాట్‌ను సంప్రదించగా… ధ్యానం, యోగా, ఆహార మార్పులు సూచించి కేవలం మూడు నెలల్లో ఆమెను ఆరోగ్యవంతురాలిగా మార్చింది. మానవ డాక్టర్లు చూపని ఓర్పు చాట్‌బాట్లు చూపిస్తుండటంతో రోగులు వాటితో మనసు విప్పి మాట్లాడుతున్నారు. బ్రిటన్‌లో ఎన్‌హెచ్ఎస్ సంస్థ సైతం చాట్‌బాట్లను పైలట్ ప్రాజెక్టుల్లో ఉపయోగిస్తోంది. లండన్‌లో ఒక చాట్‌బాట్ మానసిక ఆరోగ్య సలహాలు అందిస్తూ వందల మంది ఆత్మహత్యలను ఆపిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
భారత్‌లోనూ మొదలైన సాంకేతిక విప్లవం…
భారత్‌లోనూ వైద్య రంగంలో చాట్‌బాట్ల విప్లవం మొదలైంది. హైదరాబాద్‌లోని ఒక స్టార్టప్ తెలుగు, హిందీ భాషల్లో చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో లేనిచోట రోగులు ఫోన్‌లో లక్షణాలు చెప్పగానే ముందస్తు సలహా ఇస్తోంది. ముంబయిలో ఒక ఆసుపత్రి చాట్‌బాట్‌తో వైద్యుల నియామకాలు భారీగా తగ్గించింది. కేంద్ర ఆరోగ్య శాఖ సైతం ఆయుష్మాన్ భారత్ పథకంలో ఈ సాంకేతికతను భాగం చేయాలని యోచిస్తోంది.
భవిష్యత్తులో వైద్య రూపురేఖలు మార్పు…
చాట్‌బాట్లు వైద్య రంగాన్ని పూర్తిగా మార్చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలోని సగం ఆసుపత్రులు వీటిని వినియోగిస్తాయని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. మానవ వైద్యులు శస్త్రచికిత్సలకు పరిమితమైతే రోజువారీ సలహాలు, సంరక్షణ చాట్‌బాట్లే చూసుకుంటాయని ఆక్స్ట్ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు వైద్య చాట్‌బాట్లను అభివృద్ధి చేస్తున్నాయి.
అయితే పూర్తిగా నమ్మితే అంతే…
అయితే ఈ సాంకేతికతలో అపాయాలు కూడా లేకపోలేదు. చాట్‌బాట్లు తప్పులు చేసి రోగుల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్న సంఘటనలు ఉన్నాయి. గత ఏడాది అమెరికాలో ఓ యువకుడు ఛాతీ నొప్పి లక్షణాలు చెప్పగా చాట్‌జీపీటీ దానిని గ్యాస్ సమస్యగా నిర్ధారించి మందులు సూచించింది. కానీ అది గుండెపోటు ముందస్తు సంకేతం కావడంతో ఆలస్యంగా చికిత్స పొంది ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. అలాగే భారత్‌లో ఒక ఆన్‌లైన్ చాట్‌బాట్ డయాబెటిస్ రోగికి తప్పుడు ఇన్సులిన్ మోతాదు సూచించి ప్రమాదంలో పడేసింది.
మానవ పర్యవేక్షణ తప్పనిసరి
చాట్‌బాట్లలో తప్పులు, లోపాలు ఉన్న నేపథ్యంలో వీటిని మానవ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలని నిపుణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ కొత్త చట్టాలు తెస్తుండగా… భారత్‌లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు రూపొందిస్తోంది. సాంకేతికతను మితంగా వినియోగించుకోవాలని రచయిత ఆక్స్ట్ కూడా సలహా ఇచ్చాడు. మొత్తానికి చాట్‌బాట్ల ఓర్పు రోగుల మనసు గెలుస్తున్నప్పటికీ… వాటి తప్పులు మాత్రం ప్రాణాల మీదకు తెస్తున్నాయి.