- 1989లో తల్లిదండ్రులను హత్య చేసిన సోదరులు
- 35 ఏళ్ల తర్వాత శిక్ష కుదింపుపై కోర్టు సంచలన నిర్ణయం
- జీవిత ఖైదును 50 ఏళ్ల జైలు శిక్షగా తగ్గిస్తూ తీర్పు
- ఈ హత్యలపై అనేక పుస్తకాలు… నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలు
సహనం వందే, లాస్ ఏంజిల్స్:
1989లో బెవర్లీ హిల్స్‌లో సంచలనం సృష్టించిన తమ తల్లిదండ్రుల హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మెనెండెజ్ సోదరులు – ఎరిక్, లైల్‌లకు ఊరట లభించింది. లాస్ ఏంజిల్స్ కోర్టు వారి శిక్షను 50 సంవత్సరాల జీవిత ఖైదుకు తగ్గించడంతో వారు పెరోల్ (ముందస్తు విడుదల)కు అర్హత సాధించారు. వచ్చే నెలలో కాలిఫోర్నియా పెరోల్ బోర్డ్ ఈ విషయంపై విచారణ జరపనుంది. ఈ కేసు గతంలో అనేక పుస్తకాలు, డాక్యుమెంటరీలకు ఆధారం కావడం గమనార్హం.
రక్తమోడిన గతం… స్వీయ రక్షణ నాటకమా?
1989లో ఎరిక్ (18), లైల్ (21) మెనెండెజ్ సోదరులు తమ తల్లి కిట్టీ, తండ్రి జోస్ మెనెండెజ్లను వారి బెవర్లీ హిల్స్ నివాసంలో షాట్గన్తో దారుణంగా కాల్చి చంపారు. ఆయుధాలను రీలోడ్ చేసి మరీ కాల్చడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అయితే తమ తండ్రి నుండి సంవత్సరాల తరబడి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని, అందుకే స్వీయ రక్షణ కోసం ఈ చర్యకు పాల్పడ్డామని సోదరులు వాదించారు. కానీ ప్రాసిక్యూషన్ ఈ వాదనను తోసిపుచ్చింది. ఆర్థిక లబ్ధి కోసమే ఈ హత్యలు జరిగాయని ఆరోపించింది.
కోర్టులో కన్నీటి పర్యంతం…
మంగళవారం జరిగిన విచారణలో సోదరులు తమ చర్యలకు తీవ్రంగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘మా తల్లిదండ్రులు చివరి క్షణాల్లో అనుభవించిన బాధను నేను ఊహించగలను’ అని 54 ఏళ్ల ఎరిక్ కోర్టుకు తెలిపాడు. 57 ఏళ్ల లైల్ సైతం తమ చర్యల వల్ల కుటుంబ సభ్యులు పడిన బాధను గుర్తు చేసుకుని క్షమాపణలు కోరాడు. విడుదల చేస్తే లైంగిక వేధింపుల బాధితులకు సాయం చేయడంతో పాటు, జైలు జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తామని వారు తెలిపారు.
జైలులో మంచి పనులు చేశారా?
గత 35 ఏళ్లుగా జైలులో ఉన్న ఈ సోదరులు విద్య పూర్తి చేయడమే కాకుండా వృద్ధులు, రోగుల సంరక్షణ వంటి కార్యక్రమాలు ప్రారంభించారు. వారి ఈ కృషిని జడ్జి జెసిక్ కొనియాడారు. అయితే 1996లో వారికి విధించిన జీవిత ఖైదు అప్పటి పరిస్థితుల్లో సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
అబద్ధాల పుట్ట… ప్రాసిక్యూషన్ వాదన
మరోవైపు లాస్ ఏంజిల్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం సోదరుల విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ హబీబ్ బాలియన్ మాట్లాడుతూ, హత్యల తర్వాత వారు పోలీసులకు, కుటుంబ సభ్యులకు అబద్ధాలు చెప్పారని, విచారణలో తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారని ఆరోపించారు. ‘వారు ఇప్పటికీ తమ తప్పును పూర్తిగా అంగీకరించకుండా సాకులు చెబుతున్నార’ని ఆయన వాదించారు.
నెట్‌ఫ్లిక్స్ ప్రభావం: సెలబ్రిటీల మద్దతు
నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన మాన్స్టర్స్: ది లైల్ అండ్ ఎరిక్ మెనెండెజ్ స్టోరీ, డాక్యుమెంటరీ ది మెనెండెజ్ బ్రదర్స్ ఈ కేసును మరోసారి ప్రజల్లోకి తెచ్చాయి. కిమ్ కర్దాషియన్, రోసీ ఓ’డోనెల్ వంటి ప్రముఖులు సోదరుల విడుదలకు మద్దతు తెలిపారు. కాగా మాజీ డిస్ట్రిక్ట్ అటార్నీ జార్జ్ గాస్కాన్ కూడా శిక్ష తగ్గింపును సమర్థించారు. కాలిఫోర్నియా పెరోల్ బోర్డ్ జూన్ 13న జరగనున్న విచారణలో సోదరుల విడుదలకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోనుంది. గవర్నర్ గావిన్ న్యూసమ్ కూడా వారి క్షమాపణ పిటిషన్‌ను పరిశీలిస్తున్నారు.