పాక్‌కు వేల కోట్ల ఐఎంఎఫ్ రుణం

  • దాదాపు 8,500 కోట్లు ఇచ్చిన సంస్థ
  • ఉగ్రదేశానికి ఆర్థిక సాయంపై విమర్శ
  • భారత్ అభ్యంతరం చెప్పినా వినని ఐఎంఎఫ్
  • ఉగ్రవాదాన్ని పెంచేందుకే ఈ నిధులా?

భారత్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అవిశ్రాంతంగా పోరాడుతుంటే, సరిహద్దుల్లో పాకిస్థాన్ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్‌కు భారీ మొత్తంలో రుణం ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సిద్ధమవడం విమర్శలకు దారితీస్తోంది. పాకిస్థాన్ ఈ నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించే ప్రమాదం ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఐఎంఎఫ్ మాత్రం రుణాన్ని మంజూరు చేసింది.

ఆర్థిక స్థిరత్వమే ప్రధాన కర్తవ్యం…
ఐఎంఎఫ్ అనేది 191 దేశాలు సభ్యులుగా ఉన్న ఒక అంతర్జాతీయ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన ఆర్థికాభివృద్ధిని, సభ్య దేశాల శ్రేయస్సును పెంపొందించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడం, ద్రవ్య సంబంధిత సహకారాన్ని అందించే ఆర్థిక విధానాలను ప్రోత్సహించడంలో ఐఎంఎఫ్ సభ్య దేశాలకు సాయం చేస్తుంది. ఈ లక్ష్యాలను సాధించడానికి ఐఎంఎఫ్ ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించడం. ప్రపంచ వాణిజ్యం, ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించడం. సభ్య దేశాల ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాలను నివారించడం.

ఐఎంఎఫ్‌కు నిధులు ఎలా సమకూరుతాయి?
ఐఎంఎఫ్ తన సభ్య దేశాల ఆర్థిక బలానికి అనుగుణంగా నిర్ణయించిన రుసుమును వసూలు చేస్తుంది. దీనిని కోటా అని పిలుస్తారు. ఒక దేశం ఆర్థిక పరిస్థితి, జీడీపీ పరిమాణం, విదేశీ వాణిజ్య కార్యకలాపాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ కోటాను నిర్ణయిస్తారు. ప్రతి సభ్య దేశం సంస్థలో చేరినప్పుడు ఈ కోటాను చెల్లించవలసి ఉంటుంది. ఇదే ఐఎంఎఫ్‌కు ప్రధాన ఆదాయ వనరు. దీనితోపాటు ఐఎంఎఫ్ ఇచ్చిన రుణాలపై వసూలు చేసే వడ్డీ కూడా నిధులను సమకూర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ నిధుల కొరత ఏర్పడితే, ఐఎంఎఫ్ ఇతర మార్గాల ద్వారా కూడా నిధులను సమీకరిస్తుంది. ఉదాహరణకు ఐఎంఎఫ్ కూడా ఇతర అభివృద్ధి చెందిన దేశాల నుండి రుణాలు తీసుకోవచ్చు. న్యూ అరేంజ్‌మెంట్స్ టు బారో (ఎన్ఏబి) అనే ప్రత్యేక ఏర్పాటు ద్వారా అమెరికా, జపాన్, జర్మనీ వంటి దాదాపు 36 దేశాల నుండి ఇది రుణాలు పొందుతుంది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో సభ్య దేశాలతో ద్వైపాక్షిక రుణ ఒప్పందాలు కుదుర్చుకుని కూడా నిధులను సేకరిస్తుంది.

ఐఎంఎఫ్ కార్యకలాపాల నిర్వహణ ఎలా?
ఐఎంఎఫ్ తన సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థలను నిశితంగా పరిశీలిస్తుంది. వాటి ఆర్థిక విధానాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది. ప్రతి సంవత్సరం సభ్య దేశాల ఆర్థిక స్థితిపై ఒక సమగ్ర నివేదికను కూడా విడుదల చేస్తుంది. ఏదైనా దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా నిరోధించడానికి, వారి ఆర్థిక విధానాలను మెరుగుపరచడానికి ఐఎంఎఫ్ సూచనలు ఇస్తుంది.

రుణాలు ఇవ్వడానికి షరతులు…
ఐఎంఎఫ్ రుణాలు మంజూరు చేసే సమయంలో కొన్నిసార్లు కఠినమైన నిబంధనలను కూడా విధిస్తుంది. ఉదాహరణకు పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం, ప్రభుత్వ రాయితీలను తగ్గించడం, ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడం వంటి షరతులు విధించవచ్చు. ఒకవేళ సభ్య దేశాలు ఈ షరతులను పాటించడంలో విఫలమైతే, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. సంక్షోభంలో ఉన్న దేశాలకు ఐఎంఎఫ్ ప్రధానంగా మూడు రకాల రుణ సాయాన్ని అందిస్తుంది. రాపిడ్ ఫైనాన్సింగ్ అరేంజ్‌మెంట్, ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ, స్టాండ్ బై అరేంజ్‌మెంట్.

శిక్షణ, సాంకేతిక సహకారం
ఐఎంఎఫ్ కేవలం ఆర్థిక నివేదికలు, సూచనలు ఇవ్వడానికే పరిమితం కాదు. సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడానికి ఆ సూచనలను ఎలా అమలు చేయాలో కూడా వివరిస్తుంది. సభ్య దేశాల ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ శిక్షణ ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థను ఆధునీకరించడం, పన్నుల విధానాలను మెరుగుపరచడం, క్రమం తప్పకుండా ఆర్థిక డేటాను సేకరించడం, దాని ఆధారంగా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి పెడుతుంది. ఆర్థిక సంక్షోభం నుండి వీలైనంత త్వరగా బయటపడటానికి అవసరమైన సాంకేతిక సాయాన్ని కూడా అందిస్తుంది. ఈ కార్యకలాపాలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించడానికి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి వంటి ఇతర అంతర్జాతీయ సంస్థల సహకారం కూడా తీసుకుంటుంది.

అత్యధికంగా రుణాలు పొందిన దేశాలు…
ఐఎంఎఫ్ తన సభ్య దేశాలకు వారి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నిరంతరం రుణాలు అందిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం అత్యధికంగా రుణాలు తీసుకున్న దేశాలలో అర్జెంటీనా (40.9 బిలియన్ డాలర్లు), ఉక్రెయిన్ (14.6 బిలియన్ డాలర్లు), ఈజిప్ట్, పాకిస్తాన్ (8.3 బిలియన్ డాలర్లు), ఈక్వెడార్, కొలంబియా, అంగోలా, కెన్యా, బంగ్లాదేశ్ (2.69 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. రష్యాతో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్ నాలుగో స్థానంలో నిలిచింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *