హత్యకు గురైన వ్యక్తి కోర్టులో ప్రత్యక్షం

  • తన హత్యను తానే వివరించిన మృతుడు
  • ఏఐ సాయంతో కోర్టులో డిజిటల్ రూపం
  • న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయం
  • ఆశ్చర్యపోయిన న్యాయమూర్తి

సాధారణంగా కోర్టులో నేరం చేసినవాళ్లు, సాక్షులు, లాయర్లు వాదోపవాదాలు వినిపిస్తుంటారు. కానీ అమెరికాలోని ఓ కోర్టులో మాత్రం మూడేళ్ల క్రితం హత్యకు గురైన వ్యక్తి స్వయంగా మాట్లాడి అందరినీ షాక్‌కు గురిచేశాడు! అవును మీరు విన్నది నిజమే. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీతో సృష్టించిన అతని డిజిటల్ రూపం కోర్టులో ప్రత్యక్షమై, తన హంతకుడి శిక్షా విచారణలో బాధితుడి వాంగ్మూలాన్ని వినిపించింది. ఈ అద్భుతమైన ఘటన న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీసింది.

డిజిటల్ పునర్జీవం!
2021లో అరిజోనాలో క్రిస్ పెల్కీ (37) అనే వ్యక్తిని గాబ్రియేల్ హోర్కాసిటాస్ అనే దుర్మార్గుడు కాల్చి చంపాడు. కేసు విచారణలో హోర్కాసిటాస్‌ను దోషిగా తేల్చిన తర్వాత, శిక్ష ఖరారు చేసే సమయంలో పెల్కీ కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. అతడి స్వర రికార్డింగ్‌లు, వీడియోలు, ఫొటోలను ఉపయోగించి అతడికి ఏఐ సాయంతో ఓ డిజిటల్ రూపాన్ని క్రియేట్ చేసింది. కోర్టు హాల్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా, బూడిద రంగు టోపీ పెట్టుకున్న పెల్కీ డిజిటల్ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ‘గాబ్రియేల్ హోర్కాసిటాస్, నన్ను కాల్చిన వ్యక్తి… ఆ రోజు మనం కలవడం దురదృష్టం. మరో జన్మలో మనం మంచి స్నేహితులం అయ్యుండొచ్చు’ అంటూ ఎంతో క్షమాగుణంతో మాట్లాడాడు.

క్షమతో కదిలించిన హృదయాలు!
పెల్కీ సోదరి స్టేసీ వేల్స్ ఈ అద్భుతమైన ప్రకటన గురించి మాట్లాడుతూ, తమ సోదరుడి క్షమాగుణం, దైవ విశ్వాసమే తమకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. ‘నేను క్షమాపణను నమ్ముతాను, క్షమించే దేవుడిని విశ్వసిస్తాను. ఇప్పటికీ అదే నమ్ముతున్నాను,’ అంటూ ఏఐ పెల్కీ పలికిన మాటలు కోర్టులోని అందరి హృదయాలను కదిలించాయి. ఆ క్షణంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనయ్యారు.

న్యాయమూర్తి సైతం ఆశ్చర్యం!
ఈ విచారణను పర్యవేక్షించిన న్యాయమూర్తి టాడ్ లాంగ్ కూడా ఈ ఏఐ ప్రకటన విని ఆశ్చర్యపోయారు. ‘ఇది చాలా శక్తివంతమైన ప్రకటన. కుటుంబానికి ఎంత కోపం ఉన్నప్పటికీ, వారి మాటల్లో క్షమాగుణం వినిపించింది. అది నిజమైనదని నేను భావిస్తున్నాను,’ అంటూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చివరికి హోర్కాసిటాస్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *