- తమిళ వారసత్వానికి పట్టం కట్టండి
- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపు
- వ్యాపార సంస్థలకు కూడా ఇదే వర్తిస్తుంది
సహనం వందే, చెన్నై:
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళ భాషా సంస్కృతులపై తమకున్న అపారమైన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. రాష్ట్ర ప్రజలు తమ పిల్లలకు, అలాగే తమ వ్యాపార సంస్థలకు తప్పనిసరిగా తమిళ పేర్లే పెట్టాలని ఆయన సూచించారు. భాషా వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళ గుర్తింపును మరింతగా పెంపొందించే లక్ష్యంతో స్టాలిన్ నవదంపతులు, వ్యాపారులను ఉద్దేశించి ఈ పిలుపునిచ్చారు. ఆయన సందేశం తమిళ ప్రజల్లో భాషాభిమానాన్ని మరింతగా పెంచే అవకాశం ఉంది.
పెళ్లి వేడుకలో పిలుపు…
ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ… తాను వివాహ వేడుకలకు హాజరైన ప్రతిసారీ నవదంపతులకు ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. ‘నేను పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు, కొత్తగా పెళ్లైన జంటను వారి భవిష్యత్తు తరానికి అందమైన తమిళ పేర్లు పెట్టమని కోరుతాన’ని ఆయన అన్నారు. తమిళనాడులో తమిళులుగా జీవిస్తున్నప్పటికీ, ఉత్తరాది లేదా ఆంగ్ల పేర్లను ఎంచుకోవడం సముచితం కాదని, తమిళ పేర్ల ద్వారానే మన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని స్టాలిన్ సూచించారు.
వ్యాపారాలకు తమిళ గుర్తింపు తప్పనిసరి...
స్టాలిన్ తన పిలుపును వ్యాపార వర్గాలకూ విస్తరించారు. ‘మీరు మీ దుకాణాలను సొంత బిడ్డల్లా భావిస్తారు. అవి ఆంగ్ల పేర్లతో ఉంటే, వాటిని వెంటనే తమిళ పేర్లతో మార్చండ’ని ఆయన సూచించారు. ఒకవేళ ఆంగ్ల పేరు పెట్టడం తప్పనిసరైతే, కనీసం దానిని తమిళ లిపిలోనైనా రాయాలని కోరారు.
మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో…
గత నెల రామేశ్వరంలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళుల వారసత్వం గురించి మాట్లాడుతూ, తమిళనాడు నాయకులు తమకు పంపిన లేఖల్లో తమిళంలో సంతకాలు చేయడం లేదని విమర్శించిన నేపథ్యంలో స్టాలిన్ తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘తమిళంపై అంత అభిమానం ఉంటే, కనీసం మీ పేరునైనా తమిళంలో సంతకం చేయండ’ని మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ వ్యాఖ్యలు తమిళ భాషాభిమానులకు మరింత బలాన్నిచ్చేలా ఉన్నాయి.
తమిళ సంస్కృతి పరిరక్షణకు ముందడుగు…
స్టాలిన్ చేస్తున్న ఈ ప్రయత్నం కేవలం భాషా గుర్తింపును కాపాడటానికే పరిమితం కాదు. ఇది తమిళ సంస్కృతి, ఆత్మగౌరవం, రాష్ట్ర ప్రజల మధ్య ఐక్యతను మరింతగా పెంపొందించే ఒక ప్రయత్నంగా చూడవచ్చు. రాష్ట్రంలో ఇతర భాషల ప్రభావం పెరుగుతున్న తరుణంలో, తమిళ భాషను రోజువారీ జీవితంలో మరింతగా ఉపయోగించాలని స్టాలిన్ చేస్తున్న సూచనలు చాలా ముఖ్యమైనవి.
సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు…
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చకు దారితీశాయి. కొందరు స్టాలిన్ పిలుపును తమిళ సంస్కృతిని పరిరక్షించే ఒక గొప్ప చర్యగా ప్రశంసిస్తుంటే, మరికొందరు భాషా గుర్తింపును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ చర్చ తమిళ భాష ప్రాముఖ్యతను మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు తెచ్చింది.