పోప్ ఎన్నిక రక్తసిక్తం!

  • గతంలో కుట్రలు… నేడు రహస్య డ్రామా!
  • భక్తి, అధికారం, రహస్యాల కలయిక!
  • ఓడిపోయిన వర్గం దాడి చేసిన ఘటనలు
  • రాజకీయం… ఆధ్యాత్మికం మధ్య ఎన్నిక
  • నేడు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం

పోప్ ఎన్నికల చరిత్ర భక్తి, అధికారం, కుట్రల కలయిక. గతంలో రాజకీయ ఒత్తిళ్లు, లంచాలు ఎక్కువగా ఉన్నా, ఇప్పుడు పరిస్థితి మారింది. ఆధునిక కాన్‌క్లేవ్ ఆధ్యాత్మికంగా జరుగుతోంది. కానీ ఈ రహస్య ఎన్నికల వెనుక ఉన్న కథలు మాత్రం ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఈ ఎన్నికల వెనుక శతాబ్దాల తరబడి కుట్రలు, రాజకీయాలు నడిచాయని చరిత్ర చెబుతోంది. నేడు పరిస్థితి కొంత మారినా, గతంలో పోప్ పదవి కోసం జరిగిన ఎన్నికలు రక్తసిక్తంగా మారాయని చరిత్ర చెప్తుంది.

రహస్య సమావేశం.. పొగతో ఫలితం!
ప్రస్తుతం పోప్‌ను ఎన్నుకునేందుకు కఠినమైన నియమాలు ఉన్నాయి. 80 ఏళ్ల లోపు ఉన్న కార్డినల్స్ సిస్టీన్ చాపెల్‌లో రహస్యంగా సమావేశమవుతారు. కొత్త పోప్ ఎన్నిక కావాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ రావాలి. ఓటింగ్ పూర్తయ్యే వరకు వీరు బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోరు. చాపెల్ తలుపులు మూసేస్తారు. ఫోన్లు దాచిపెడతారు. రహస్యంగా ప్రమాణం చేస్తారు. ఎన్నిక ఫలితాన్ని పొగ ద్వారా ప్రకటిస్తారు. నల్లటి పొగ వస్తే ఎన్నిక కాలేదని, తెల్లటి పొగ వస్తే కొత్త పోప్ ఎన్నికయ్యారని అర్థం.

పోప్ పీఠం కోసం కుట్రలు… దాడులు!
గతంలో పోప్ ఎన్నికలు ఇలా శాంతియుతంగా జరిగేవి కావు. యూరోపియన్ రాజులు, ఇటలీలోని బలమైన కుటుంబాలు తమకు కావాల్సిన వ్యక్తిని పోప్‌గా చూడటానికి లంచాలు, బెదిరింపులకు పాల్పడేవారు. కొన్నిసార్లు దాడులు కూడా జరిగేవి. 904 నుంచి 963 వరకు ‘పోర్నోక్రసీ’గా పిలిచే కాలంలో రోమ్‌లోని పెద్దలు పోప్ ఎన్నికలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి హత్యలు, లంచాలు, బెదిరింపులు యథేచ్ఛగా వాడారు. 1458లో ఒక కార్డినల్‌ను ఓటు వేయకుండా అడ్డుకోవడానికి ఇద్దరు కార్డినల్స్ కొట్టుకున్నారు. 1268-71లో జరిగిన కాన్‌క్లేవ్‌లో ఏకంగా ఆరుగురు కార్డినల్స్ చనిపోయారు. ఆ ఎన్నిక ఏకంగా మూడు సంవత్సరాలు సాగింది మరి!

పైకప్పు తొలగించిన ప్రజలు.. సైనిక దాడులు!
కొన్ని పోప్ ఎన్నికల్లో విచిత్రమైన ఘటనలు జరిగాయి. ఒకసారి కార్డినల్స్‌పై ఒత్తిడి తేవడానికి స్థానిక ప్రజలు కాన్‌క్లేవ్ భవనం పైకప్పు తీసేశారు. దీంతో వారు వర్షంలో తడుస్తూనే ఎన్నికల ప్రక్రియను కొనసాగించారు. మరోసారి ఓడిపోయిన వర్గం ఏకంగా సైన్యంతో కాన్‌క్లేవ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలు పోప్ ఎన్నిక కేవలం ఆధ్యాత్మిక నిర్ణయం కాదని, రాజకీయ శక్తిని చూపించే సమయమని స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పుడు శాంతియుత ఎన్నికలు!
20వ శతాబ్దంలో కాథలిక్ చర్చి ఈ కుట్రలను తగ్గించడానికి చాలా మార్పులు చేసింది. 1996లో పోప్ జాన్ పాల్ II కొత్త నియమాలు తీసుకొచ్చారు. దీంతో ఎన్నికలు మరింత సురక్షితంగా, రహస్యంగా జరుగుతున్నాయి. ఇప్పుడు కాన్‌క్లేవ్ ఒక పవిత్రమైన బాధ్యతగా, రాజకీయ జోక్యానికి దూరంగా జరుగుతోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *