పిల్లలతో అసభ్యంగా ఏఐ చాట్‌బాట్‌

  • అసభ్య సంభాషణలు… భద్రత ప్రశ్నార్థకం!
  • స్నేహితులుగా ఉంటూ లైంగిక సంబంధాలు
  • ఫాంటసీ సెక్స్, రోల్-ప్లేలతో చెత్త మాటలు

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా రూపొందించిన కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్‌బాట్‌లు ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నాయి. ఈ చాట్‌బాట్‌లు సరదా సంభాషణల కోసం తయారు చేసినా, ఇవి చిన్నారులతో సహా అందరు యూజర్లతో అసభ్యకరమైన, లైంగిక విషయాలు మాట్లాడుతున్నాయని కొత్తగా వెలుగులోకి వచ్చింది. మెటా ఏఐ అధికారిక చాట్‌బాట్‌తో పాటు యూజర్లు తయారుచేసిన చాలా చాట్‌బాట్‌లు లైంగిక చర్చలను ప్రోత్సహిస్తున్నాయి. ఇది పిల్లల భద్రతకు పెను ప్రమాదంగా మారుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఎక్స్ (ట్విట్టర్)లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, మెటా ఏఐ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

భయానక నిజాలు…
మెటా ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న ఏఐ చాట్‌బాట్‌లు యూజర్లతో ‘ఫాంటసీ సెక్స్’, ‘రోల్-ప్లే’, ‘స్నేహితులుగా ఉంటూ లైంగిక సంబంధాలు’ వంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నాయని తేలింది. దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే, ఈ చాట్‌బాట్‌లు చిన్న పిల్లలతో కూడా ఇలాంటి సంభాషణలు కొనసాగిస్తున్నాయి. ఇది మైనర్ల భద్రతకు చాలా పెద్ద ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్స్‌లో ఒక యూజర్ ఈ విషయాన్ని చెబుతూ, ‘మెటా ఏఐ చాట్‌బాట్‌లు పిల్లలతో లైంగికంగా మాట్లాడుతున్నాయి. ఇది పిల్లల భద్రతకు అత్యంత ప్రమాదకరం’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మెటా ఏఐ మాత్రమే కాకుండా సాధారణ యూజర్లు తయారుచేసిన అనేక చాట్‌బాట్‌లు కూడా ఈ సమస్యకు కారణమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ చాట్‌బాట్‌లు సంభాషణలను మరింత లైంగికంగా మార్చాయని వెల్లడయింది. ఈ పరిస్థితి మెటా కంటెంట్‌ను నియంత్రించే విధానాలు, ఏఐని రూపొందించడంలో ఉన్న లోపాలను ప్రశ్నిస్తోంది.

గతంలోనూ మెటా తీరు అదే..‌.
గతంలో కూడా మెటా సంస్థ అనేక వివాదాస్పద సమస్యలను ఎదుర్కొంది. ఉదాహరణకు 2024లో మెటా ప్లాట్‌ఫారమ్‌లు చట్టవిరుద్ధమైన డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి విచారణను ఎదుర్కొన్నాయి. అలాగే ఆత్మహత్య, స్వీయ-హాని కలిగించే కంటెంట్‌ను తొలగించడంలో నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా ఒక ప్రముఖ సైకాలజిస్ట్ మెటా సలహా బృందం నుండి రాజీనామా చేశారు. ఈ తాజా ఏఐ వివాదం మెటా యూజర్ భద్రతా విధానాలపై విమర్శలకు తావిచ్చింది. ఈ వివాదం ఆన్‌లైన్‌లో పిల్లల భద్రతకు సంబంధించిన చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *