సహనం వందే, ఆగ్రా:
పదేళ్ల చిన్నారి ……. కానీ మనసు మాత్రం ఉక్కు సంకల్పం. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో పదేళ్ల వంశిక సికర్వార్ అనే బాలిక చేసిన ఉద్యమం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన గ్రామంలోని మహిళలకు నిత్యం ఇబ్బంది కలిగిస్తున్న ఒక మద్యం దుకాణాన్ని తరలించేలా చేసి… నిజంగానే చిన్నారి పోరాట యోధురాలు అనిపించుకుంది.
తాగొచ్చి గొడవ చేసేవారు...
కోలారా కలాన్ అనే చిన్న గ్రామంలో ఒక మద్యం దుకాణం ఉండేది. దాని వల్ల ఆ ఊరి మహిళలు నిత్యం ఏదో ఒక సమస్యను ఎదుర్కొనేవారు. కొందరు తాగి వచ్చి గొడవ చేసేవారు.. మరికొందరు మహిళలను వేధించేవారు. ఈ బాధలు చూడలేక వంశిక తండ్రి బంటీ సికర్వార్ గతంలో ఏకంగా 17 రోజులు నిరాహార దీక్ష కూడా చేశారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. తండ్రి పోరాటం ఫలించకపోవడంతో వంశిక రంగంలోకి దిగింది. తన చిన్నారి చేతులతోనే పెద్ద పోరాటానికి సిద్ధమైంది. ఊరిలోని మహిళలందరినీ కలుపుకొని.. ఆ మద్యం దుకాణం వల్ల వస్తున్న కష్టాలను అందరికీ చెప్పింది. తన తండ్రితో కలిసి ఏకంగా 48 గంటల పాటు అన్నం నీరు ముట్టుకోకుండా నిరాహార దీక్ష చేసింది.
ఊరంతా కదిలింది...
పదేళ్ల ఆ చిన్నారి దీక్షను చూసి ఊరంతా కదిలి వచ్చింది. మహిళలు, పెద్దలు అందరూ వంశికకు మద్దతుగా నిలిచారు. చిన్నారి చేస్తున్న పోరాటం స్థానిక అధికారుల చెవులకు చేరింది. వారి మనసు కరిగిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు.. ఆ మద్యం దుకాణాన్ని గ్రామం నుంచి వేరే చోటికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి వంశిక చేసిన ఉద్యమం ఊరి ప్రజలందరికీ ఎంతో సంతోషాన్నిచ్చింది. ‘వంశిక మా ఊరి కోసం పోరాడింది. చిన్న వయసులోనే ఇంత ధైర్యం చూపించిన ఈ పాప మా అందరికీ స్ఫూర్తి’ అని గ్రామస్తులు ముక్తకంఠంతో కొనియాడారు. ఈ ఘటనతో వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా పోరాడితే విజయం సాధించవచ్చని నిరూపితమైంది. వంశిక ధైర్యానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు!