- ఎలి లిల్లీ విప్లవాత్మక టాబ్లెట్ వచ్చేస్తోంది
- భారతదేశంలోనూ క్లినికల్ ట్రయల్స్ పూర్తి
- సగటున 7.2 కిలోల బరువు తగ్గే ఛాన్స్
సహనం వందే, హైదరాబాద్:
బరువు తగ్గాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే! అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ఎలి లిల్లీ ఊబకాయానికి చెక్ పెట్టే ఒక అద్భుతమైన మాత్రను త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ‘ఓర్ఫోర్గ్లిప్రాన్’ మాత్ర, ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా ఉండటమే కాకుండా, వాడటానికి కూడా చాలా సులభంగా ఉంటుందని సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దీని పంపిణీ మరింత సులభతరం కానుంది.
సగటున 7.2 కిలోల బరువు తగ్గుదల!
ఓర్ఫోర్గ్లిప్రాన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ భారతదేశంతో పాటు అమెరికా, చైనా, జపాన్, మెక్సికో వంటి దేశాల్లో టైప్-2 డయాబెటిస్ ఉన్న 550 మంది రోగులపై నిర్వహించారు. ఈ ట్రయల్స్‌లో 40 వారాల పాటు రోజుకు 36 మి.గ్రాముల డోస్ తీసుకున్న వారు సగటున 7.2 కిలోల బరువు తగ్గినట్లు తేలింది. ఈ మాత్ర రోజుకు ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. అంతేకాదు దీన్ని ఆహారంతో కానీ, నీటితో కానీ సంబంధం లేకుండా ఎప్పుడైనా వేసుకోవచ్చు.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు వరం…
ఎలి లిల్లీ సీఈఓ డేవిడ్ రిక్స్ గత నెలలో భారతదేశ పర్యటన సందర్భంగా మాట్లాడుతూ, “ఓర్ఫోర్గ్లిప్రాన్ ఒక ఓరల్ టాబ్లెట్ కావడం వల్ల దీని పంపిణీ చాలా సులభం అవుతుంది. దీనికి రిఫ్రిజిరేషన్ అవసరం లేదు. కాబట్టి ఊబకాయం, డయాబెటిస్తో బాధపడుతున్న కోట్లాది మందికి ఇది ఒక ఆయుధంలా పనిచేస్తుందని, ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో ఈ క్లినికల్ ట్రయల్స్ గత ఏడాది మే నెలలో ప్రారంభమయ్యాయి. దేశంలోని 10 వేర్వేరు ప్రాంతాల్లో 100 మంది దీనిలో పాల్గొన్నారు.
తొందరపాటు వద్దని నిపుణుల హెచ్చరిక…
అయితే వైద్య నిపుణులు ఈ ఔషధంపై జాగ్రత్తగా స్పందిస్తున్నారు. ఫోర్టిస్-సీ-డాక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డయాబెటిస్ చైర్మన్ డాక్టర్ అనూప్ మిశ్రా మాట్లాడుతూ, “ఓర్ఫోర్గ్లిప్రాన్పై ఇప్పుడే ఒక నిర్ధారణకు రావడం తొందరపాటు అవుతుంది. దీనికి పోటీగా ఇప్పటికే రైబెల్సస్ (సెమాగ్లుటైడ్) వంటి మాత్రలు డయాబెటిస్, ఊబకాయం నియంత్రణలో బాగా పనిచేస్తున్నాయ”ని అభిప్రాయపడ్డారు.
కోట్లాది మందికి ఆశాకిరణం…
భారతదేశంలో ఊబకాయం, డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్న దాదాపు కోట్లాది మందికి ఇది ఒక అర్థవంతమైన ఔషధంగా మారే అవకాశం ఉందని రిక్స్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ మాత్ర సామర్థ్యం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంజెక్షన్ ఔషధాలైన వెగోవీ (సెమాగ్లుటైడ్ 2.4 మి.గ్రా) లేదా మౌంజారో (టిర్జెపటైడ్) కంటే కొంచెం తక్కువగా ఉండవచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, సూదులంటే భయపడేవారికి ఓర్ఫోర్గ్లిప్రాన్ ఒక గొప్ప వరంగా రానుంది అనడంలో సందేహం లేదు!