బాలీవుడ్ సినీ నటుడు సునీల్ శెట్టి కామెంట్
సహనం వందే, ముంబై:
పహల్గాంలో జరిగిన దాడి తర్వాత పాకిస్థానీ కళాకారులపై నిషేధం విధించాలన్న డిమాండ్‌కు నటుడు సునీల్ శెట్టి గట్టిగా మద్దతు తెలిపారు. మన శాంతికి భంగం కలిగించి, అమాయకులను చంపేవారితో కళలు, క్రికెట్ వంటి రంగాల్లో పనిచేయటం సరైనది కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు దేశం ఐక్యంగా ఉండాలని, ఎవరూ విద్వేషాలు వ్యాప్తి చేయకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉగ్రదాడి నేపథ్యంలో స్పందించిన సునీల్ శెట్టి
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబీర్ గులాల్’ సినిమాను ఇండియాలో విడుదల చేయకూడదని చాలా మంది డిమాండ్ చేశారు. మే 9న విడుదల కావాల్సిన ఈ సినిమాకు భారతీయ థియేటర్లలో అనుమతి ఇవ్వలేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి.
ఈ విషయంపై సునీల్ శెట్టి మాట్లాడుతూ, ‘మన శాంతిని చెడగొట్టాలని చూసే, అమాయక ప్రజలను చంపే ఎవరితోనైనా సరే అన్ని రకాల సంబంధాలు తెంచుకోవాలి. క్రికెట్ అయినా, సినిమాలైనా అన్నింటిపై నిషేధ విధించాల’ని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైన్యానికి సరైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇచ్చారని ఆయన అన్నారు. ‘మన సైనికులకు ఏం చేయాలో వారికి బాగా తెలుసు. మనం ఒక్కటిగా, ఐక్యంగా ఉందాం. ఎవరూ విద్వేషాలు వ్యాప్తి చేయకుండా చూసుకుందాం. బాధ్యతగల పౌరులుగా మనం చేయాల్సింది ఇదే’నని ఆయన పిలుపునిచ్చారు.